భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం
వెల్లడించిన టీటీడీ ఈవో జె. శ్యామల రావు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో) జె. శ్యామల రావు శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు కొందరు ఈవోకు ఫోన్ చేశారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు ఈవో.
సాధ్యమైనంత మేర భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అత్యాధునిక ఏఐ టెక్నాలజీని అనుసంధానం చేయబోతున్నట్లు తెలిపారు. దీని ద్వారా కేవలం 2 లేదా 3 గంటల్లోపే స్వామి వారి దర్శనం కలగనుందని తెలిపారు జె. శ్యామల రావు.
ఇదిలా ఉండగా గత నవంబర్ నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 111 కోట్లు వచ్చినట్లు తెలిపారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని, 97 లక్షల శ్రీవారి లడ్డూలు పంపిణీ చేశామన్నారు.
19.74 లక్షల మంది అన్న ప్రసాదాలు స్వీకరించారని, 7.31 లక్షల మంది తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో గౌతమి, సివిఎస్‌వో శ్రీధర్, సిఇ సత్యనారాయణ కూడా ఉన్నారు.