అదంతా అబద్దమని పేర్కొన్న శ్యామల రావు
తిరుమల – కోట్లాది మంది భక్తులు కొలిచే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పుణ్య క్షేత్రం నిత్యం వివాదాల సుడి గుండంలో చిక్కు కోవడం విస్తు పోయేలా చేసింది. నిన్నటికి నిన్న సాక్షాత్తు స్వామి వారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ గగ్గోలు పెట్టారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన కామెంట్స్ కు మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారి పోయారు. పవన్ కళ్యాణ్ ను చూసి మరికొందరు నటులు దీక్షలకు శ్రీకారం చుట్టారు.
ఈ తరుణంలో లడ్డూ వివాదం ఇంకా కొనసాగుతూ ఉండనే మరో వివాదం బయటకు వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులకు తాము తీసుకున్న శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది.
ఈ మొత్తం వ్యవహారంపై రాద్దాంతం చోటు చేసుకోవడంతో తీవ్రంగా స్పందించారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి పొగాకు పొట్లం రాలేదన్నారు. ఇది పూర్తిగా ఫేక్ ప్రచారమని కొట్టి పారేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేయడం మంచి పద్దతి కాదన్నారు.
తిరుమలలోని లడ్డు పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారని తెలిపారు ఈవో. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందని పేర్కొన్నారు.
ఇంత పకడ్బందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు జె. శ్యామలా రావు.