విన్నవించిన టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుమల – టీటీడీ ఈవో జె. శ్యామల రావు సంచలన ప్రకటన చేశారు. తిరుమల పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. నిర్దేశించిన సమయాని కంటే ముందే భక్తులు దర్శనం కోసం వస్తున్నారని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి రావాలని, టీటీడీకి సహకరించాలని కోరారు ఈవో.
ఇదిలా ఉండగా ఇదే విషయం గురించి పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియ చేయడం జరిగిందని అన్నారు శ్యామల రావు. అయినప్పటికీ ఇటీవల కొంత మంది భక్తులు తమకు కేటాయించిన సమయానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి క్యూలైన్లలోకి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు.
అంతే కాకుండా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈవో శ్యామల రావు. ఇది సరైన పద్ధతి కాదని తెలియ చేస్తున్నామన్నారు..
శ్రీవారి దర్శన టోకెన్లు పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి మాత్రమే క్యూలైన్లలోకి ప్రవేశించాలని మరోసారి విన్నవించారు.