భక్తుల దర్శనానికే పెద్దపీట
టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి
తిరుమల – దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ విధించడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగిందని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఏవీ ధర్మా రెడ్డి.
వేసవి కారణంగా భారీ ఎత్తున భక్తులు తిరుమల స్వామి వారిని దర్శించు కునేందుకు వస్తున్నారని , వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. వచ్చే మూడు నెలల పాటు ఇదే స్థాయిలో భక్తుల రద్దీ ఉంటుందని పేర్కొన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
తిరుపతి లోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో ఏవీ ధర్మా రెడ్డి మీడియాతో మాట్లాడారు. వేసవి కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని చెప్పారు. దీంతో దర్శన సమయం మరింత ఎక్కువగా ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు ఏవీ ధర్మా రెడ్డి.
క్యూ లైన్లు, కంపార్ట్‌మెంట్లు, బయట లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, స్నాక్స్ , ఇతర వైద్య సదుపాయాలు నిరంతరాయంగా కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు సహాయం అందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో పాటు 2500 మంది శ్రీవారి సేవకులను నియమించామని వెల్లడించారు టీటీడీ ఈవో.