సనాతన ధర్మంలో మహిళకు పెద్దపీట
టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడి
తిరుపతి – మహిళా దినోత్సవం సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవీ ధర్మా రెడ్డి. సమస్త మానవ జాతికి మొదటి దైవం తల్లి అని అన్నారు. హైందవ సనాతన సంస్కృతిలో మహిళకు విశేషమైన స్థానం ఉందని చెప్పారు.
టీటీడీ ఉద్యోగినులు తమ ఇంటిని చక్కబెట్టుకున్న విధంగానే, సంస్థ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయడానికి కృషి చేయాలని కోరారు. టీటీడీ కళాశాలల అధ్యాపకులు మరింత శ్రద్ధతో పనిచేసి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చి దిద్దాలని పిలుపునిచ్చారు. కళాశాల విద్యార్థులు చక్కగా చదువుకొని టీటీడీకి మంచి పేరు తీసుకు రావాలని, జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని కోరారు.
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త అనంతలక్ష్మి మాట్లాడుతూ భారతీయ సమాజంలో స్త్రీ శక్తికి ఉన్నత స్థానం ఉందన్నారు. మహిళలు రాజ్య పాలనతో పాటు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారని గుర్తు చేశారు. పురుషులు బుద్ధితో ఆలోచిస్తే, మహిళలు హృదయంతో ఆలోచించి పాలన సాగిస్తారని చెప్పారు.
మహిళ విజయం వెనుక కుటుంబం ప్రోత్సాహం తప్పక ఉంటుందన్నారు. అంతరిక్ష యానంతో పాటు యోగా, తపోసాధనకు మహిళ శరీరం అనువుగా ఉంటుందని పరిశోధనల్లో నిరూపితమైందన్నారు. అంతరిక్ష యానం నుంచి యుద్ధరంగం వరకు అన్నింటా మహిళ కీలక పాత్ర పోషిస్తోందని తెలియజేశారు.