టీటీడీ పేరుతో నకిలీ వెబ్ సైట్స్..యాప్స్
టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీటీడీ పేరుతో పలు నకిలీ వెబ్ సైట్లు ఉన్నాయని, వాటి పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ఇందులో భాగంగా మరింత సమర్థవంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు ఏవీ ధర్మా రెడ్డి. టీటీడీ ఐటి విభాగం క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. తమ విచారణలో ఏకంగా టీటీడీ పేరుతో 52 నకిలీ వెబ్‌సైట్లను, 13 నకిలీ మొబైల్ యాప్‌లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని స్పష్టం చేశారు ఈవో.
ఇదిలా ఉండగా భక్త బాంధవులు దయచేసి టీటీడీకి సంబంధించి అధికారికంగా ఉన్న వెబ్ సైట్ ను మాత్రమే వినియోగించాలని కోరారు. ఇందుకు గాను ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని సూచించారు ఏవీ ధర్మారెడ్డి.