Monday, April 21, 2025
HomeDEVOTIONAL9న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

9న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

శాస్త్రోక్తంగా నిర్వ‌హిస్తామ‌న్న ఈవో ధ‌ర్మా రెడ్డి

తిరుమ‌ల – తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది.ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు.

ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజ స్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు.

ఆ తరువాత శ్రీవారి మూల విరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింప చేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకుని 9వ‌ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టీటీడీ రద్దు చేసిందని కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments