టీటీడీ ఈవో షాక్ హోటల్ లైసెన్స్ రద్దు
ఆకస్మిక తనిఖీలతో హోరెత్తిస్తున్న శ్యామల రావు
తిరుమల – కోట్లాది మంది నిత్యం కొలిచే తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు నానా తంటాలు పడుతున్నారు కొత్తగా ఈవోగా కొలువు తీరిన జె. శ్యామల రావు. ఆయన వచ్చీ రావడంతోనే దూకుడు పెంచారు. టీటీడీ పాలనా విభాగాన్ని ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు. ఆకస్మిక తనిఖీలు చేశారు. క్యూ కాంప్లెక్స్ లను సందర్శించారు.
కంపార్ట్ మెంట్లలో భక్తులతో సంభాషించారు. అక్కడి నుంచి నేరుగా నిత్యం భక్తుల కడుపులు నింపుతున్న వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్ ను పలుమార్లు సందర్శించారు. తనిఖీ చేశారు. తానే స్వయంగా అన్నదానం స్వీకరించి మరింత నాణ్యత ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఎక్కడ కూడా అపరిశుభ్రత ఉండ కూడదని, చెత్త చెదారం లేకుండా ఉండాలని ఆదేశించారు. అపరిశుభ్రతతో ఉండే హొటళ్లకు చుక్కలు చూపించారు. గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలతో హోరెత్తించారు. నోటీసులు జారీ చేశారు. భక్తుల ఆరోగ్యం తమకు ముఖ్యమని, ఆదాయం కాదని స్పష్టం చేశారు.
తాజాగా తిరుమలలోని తొమ్మిది పెద్ద క్యాంటీన్లలో ఒక దాని పరిధిలోకి వచ్చే కౌస్తుభం సమీపంలోని హోటల్ బాలాజీ భవన్ లైసెన్స్ రద్దు చేశారు. గత జూన్ నెలలో ఈ హోటల్ కు తుది నోటీసు జారీ చేయడం జరిగిందని తెలిపారు.