DEVOTIONAL

అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Share it with your family & friends

అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు ఉత్స‌వాలు

తిరుమల – తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పురటాసి మాసం కూడా వస్తున్నందు వల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో జె. శ్యామలరావు చెప్పారు . అన్నివిభాగాల అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీర బ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో అక్టోబరు 4న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున వేంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.

⁠ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయ‌ని, గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుందని వెల్ల‌డించారు.

⁠ ⁠భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడం జరిగిందన్నారు ఈవో.

⁠సుమారు ఏడు లక్షల లడ్డూల బఫర్‌ స్టాక్‌ను ఉంచు కోవడం జరుగుతుందన్నారు.⁠ ⁠టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, జిల్లా పోలీసులతో ⁠గరుడ సేవకు ప్రత్యేకంగా అదనపు భద్రత ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

⁠నిత్యం కామన్‌ కమాండ్‌ సెంటర్‌ ద్వారా భద్రత పర్యవేక్షణ నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు. ⁠వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల, తిరుపతిలలో పలు ఇంజినీరింగ్‌ పనులు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు ఈవో.

భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌ దీపాలంకరణలు చేయ‌డంతో పాటు ⁠వాహన సేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో గ్యాలరీలు, పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అక్టోబర్‌ 4 నుండి 12వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదన్నారు.

తిరుమలలో గదుల లభ్యత తక్కువగా ఉన్నందున, తిరుమలలో గదులు లభించని భక్తులు తిరుపతిలో బస చేయాలని సూచించారు.

⁠ ⁠కల్యాణకట్ట, ఇతర మినీ కల్యాణ కట్టలలో క్షురకులు నిరంతరాయంగా భక్తులకు సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలిపారు. పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి, అదనపు సిబ్బంది ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు ఈవో.

⁠ ⁠మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలో అన్న ప్రసాదం, పాలు, అల్పాహారం వితరణ చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

⁠తిరుమలలోని అశ్వని ఆసుపత్రి, వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని వైద్య కేంద్రాలు, డిస్పెన్సరీలతోపాటు పలు ప్రథమ చికిత్స కేంద్రాలు, మొబైల్‌క్లినిక్‌, అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

⁠ ⁠4,000 మంది శ్రీవారి సేవకులు, తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు సేవలందిస్తారని స్ప‌ష్టం చేశారు. ⁠శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవల ప్రత్యక్ష ప్రసారం ఉంటుంద‌న్నారు.⁠ ⁠ఫొటో ఎగ్జిబిషన్‌, ఫలపుష్ప ప్రదర్శనశాల, ఆయుర్వేద, శిల్ప ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తామ‌న్నారు.