శ్రీవారి సేవకుల సేవలు అద్భుతం – ఈవో
అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ
తిరుమల – శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన గరుడ సేవ ఘనంగా జరిగింది. ఊహించని దాని కంటే ఎక్కువగా భక్తులు హాజరయ్యారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రధానంగా శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు.
గరుడ వాహన సేవను దర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు గ్యాలరీల్లో వేచి ఉన్నారు. ఉదయానికల్లా గ్యాలరీలు భక్తులతో నిండాయి. ఉదయం 5 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. తూర్పు-పశ్చిమ-ఉత్తరం-దక్షిణ మాడవీధుల్లో గల 200కు పైగా గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చున్నారు.
భక్తుల కోసం ఉదయం 5 నుండి 6 గంటల మధ్య పాలు, కాఫీ, ఉదయం 6.30 నుండి 8 గంటల మధ్య ఉప్మా, పొంగళి పంపిణీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఉదయం 10 గంటలకు సాంబార్ అన్నం, టమాటా అన్నం, స్వీట్ పొంగల్ అందించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దాదాపు 3 గంటల వరకు భక్తులకు రెండు లక్షలకు పైగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు.
సాయంత్రం సుండల్, కాఫీ, పాలు మళ్లీ పంపిణీ చేశారు. సాయంత్రం 6.30 గంటలకు గరుడ వాహనం ప్రారంభం కానుండగా ఉత్తర, తూర్పు మాడ వీధుల్లో సాయంత్రం 6 గంటల వరకు వెజిటబుల్ కిచిడీ పంపిణీ చేశారు.
టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి గ్యాలరీలను పరిశీలించి భక్తులకు అందజేస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు.
భక్తులకు అంకిత భావంతో, భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల నిస్వార్థ సేవలను టీటీడీ ఈవో కొనియాడారు.