18 నుంచి శ్రీవారి టికెట్లు విడుదల
ప్రకటించిన టీటీడీ ఈవో శ్యామల రావు
తిరుమల – శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలు కొలువు తీరిన తిరుమల పుణ్య క్షేత్రాన్ని దర్శించుకునే కోట్లాది మంది భక్తులకు తీపి కబురు చెప్పింది.
దర్శనానికి సంబంధించి జూలై 18 నుంచి ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో) జె. శ్యామల రావు. ఈ మేరకు టీటీడీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మధ్య దళారీల మాటలు నమ్మి మోస పోవద్దని, అధికారికంగా టీటీడీ పోర్టల్ లోనే నమోదు చేసుకోవాలని సూచించారు ఈవో జె. శ్యామల రావు.
ప్రతి రోజూ వచ్చే వేలాది మంది భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.. అన్నప్రసాద సముదాయంలో యంత్రాలను ఆధునీకీకరణ చేస్తున్నామని, ఇదే సమయంలో ఉద్యోగుల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు జె. శ్యామల రావు.