వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు – ఈవో
వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు
తిరుమల – వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని అన్ని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు భక్తులు సూచనలు, ఫిర్యాదులు చేశారు. కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
జనవరి 10 నుండి 19 వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయన్నారు.1.40 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామన్నారు. 19,500 శ్రీవాణి టికెట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
ఆ పది రోజులు దాతలకు రూ.300 ప్రవేశ దర్శన క్యూ లైన్ లో మాత్రమే అనుమతి ఉంటుందన్నారు ఈవో. జనవరి 8 నుంచి 19 తేదీన వరకు దాతలకు గదుల కేటాయింపు రద్దు చేశామన్నారు. 7 తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందన్నారు.
వైకుంఠ ఏకాదశి శుక్రవారం రోజున రావడంతో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోటా తగ్గించాల్సి వచ్చిందన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించ బోమని స్పష్టం చేశారు ఈవో.
ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే మాత్రమే బ్రేక్ దర్శనం కేటాయిస్తామన్నారు. ఆలయంలో మహిళలు, వృద్ధులు పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని భక్తుల నుండి అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. రద్దీ తక్కువగా ఉన్నప్పుడు క్యూ కాంప్లెక్స్ కు దగ్గరగా క్యూలైన్ లోకి అనుమతించాలని కోరారు.
ప్రవేటు ట్యాక్సీ ఆగడాలను అరికట్టాలని ఈఓకు ఫిర్యాదు చేశారు. నాణ్యమైన ముడిసరుకులతో లడ్డూ తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నామని తెలిపారు ఈవో. లడ్డూ, అన్నప్రసాదాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. టూరిజం కోటాలో అవకతవకలు జరుగుతున్నాయని అందుకే ఆ కోటాను రద్దు చేశామన్నారు.