DEVOTIONAL

దర్శనం టికెట్ల కోసం ద‌ళారుల‌ను న‌మ్మొద్దు

Share it with your family & friends

నెట్ సెంటర్ నిర్వాహకుడి పై కేసు : టీటీడీ

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ద‌ర్శ‌నం టికెట్ల‌కు సంబంధించి ద‌ళాల‌రుల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు. ఈ మేర‌కు శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ద‌ర్శ‌న టికెట్ల‌కు సంబంధించి టీటీడీకి చెందిన వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్ర‌మే న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు. భ‌క్తులు తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని కోరారు.

తమిళనాడుకు చెందిన నలుగురు భక్తులు తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవానికి నకిలీ టికెట్లతో వైకుంఠంలోనికి ప్రవేశించారని తెలిపారు. వీరిని టిటిడి విజిలెన్స్ అధికారులు గుర్తించి, విచారించగా తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు అన్నాదురై ఇచ్చాడ‌ని తెలిపార‌ని పేర్కొన్నారు.

పాస్ పోర్ట్ లోని చివరి నెంబర్లు మార్చి ఆన్ లైన్ లో కళ్యాణోత్సవం టికెట్లు బుక్ చేసి, అధిక ధరలకు విక్రయించినట్లు వారు తెలిపారు. దీంతో సదరు వ్యక్తులపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామ‌న్నారు ఈవో.

కొంత మంది దళారులు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయ‌ని తెలిపారు. ప్రస్తుత టిటిడి యాజమాన్యం దళారుల ఏరివేత పట్ల అకుంఠిత దీక్షతో ఉందన్నారు.

దర్శనాల కోసం భక్తులు దళారులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికా వద్దని కోరారు. భక్తులు పొందిన టికెట్లను, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్శనానికి వెళ్లే ముందు మరొకసారి పరీక్షించడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో వారు పొందిన టికెట్లు నకిలీగా తేలితే భక్తులు అనవసరమైన ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని హెచ్చ‌రించారు.