క్యూ లైన్లను పరిశీలించిన ఈవో
అధికారికి షోకాజ్ నోటీస్ జారీ
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి జె. శ్యామలా రావు సీరియస్ అయ్యారు. ఆయన ఆకస్మిక తనిఖీలతో హోరెత్తిస్తున్నారు. దీంతో టీటీడీలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
ఇదిలా ఉండగా ఇవాళ నారాయణ గిరి ఉద్యాన వనాల్లో క్యూ లైన్లను పరిశీలించారు ఈవో జె శ్యామలా రావు. పారిశుధ్యం సరిగా లేక పోవడాన్ని గమనించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు ఈవో.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళ్లే సర్వ దర్శనం, స్లాటెడ్ సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులకు పలు సూచనలు చేశారు.
నారాయణగిరి షెడ్లలోని క్యూలైన్ల పరిశీలనలో భాగంగా సరైన పారిశుద్ధ్య చర్యలు లేక పోవడంపై మండి పడ్డారు.
ఈవో వెంట జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహ కిషోర్, సిఈ నాగేశ్వరరావు తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.