DEVOTIONAL

స్విమ్స్ ఆస్ప‌త్రిని త‌నిఖీ చేసిన ఈవో

Share it with your family & friends

నిర్మాణంలో ఉన్న భ‌వ‌నాలు చేప‌ట్టాలి

తిరుప‌తి – స్విమ్స్ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఇతర భవనాలను వేగవంతంగా పూర్తి చేసి రోగులకు అందుబాటులోనికి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు. స్విమ్స్‌ డైరెక్టర్ డాక్టర్ ఆర్ వి. కుమార్ తో కలిసి స్విమ్స్‌లోని వివిధ విభాగాలలో రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై ఈవో సమీక్షించారు.

ఇందులో ప్రధానమైన విభాగాలతో పాటు, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ తదితర విభాగాధిపతులతో వారి వారి విభాగాలలో జరుగుతున్న చికిత్సలు, మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, రోగుల సంఖ్య పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. అనంతరం జనరల్ వార్డ్, పద్మావతి ఆసుపత్రిలోని మూడవ అంతస్తులోని ఆపరేషన్ థియేటర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు.

తరువాత అత్యవసర చికిత్స విభాగంలో వైద్యులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాలు, ఎన్ టిఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, ఓపి రిజిస్ట్రేషన్ తదితర అంశాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగుల సహాయకుల గదిని పరిశీలించి అక్కడ వేచి ఉన్న వారితో టీటీడీ అందిస్తున్న భోజనం, వైద్య సౌకర్యాల గురించి ఈవో ఆరా తీశారు.

ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన శ్రీ దొరస్వామి(గుండె ఆపరేషన్), కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన శ్రీ సుబ్బారావు ( హెర్నియా ఆపరేషన్), చిత్తూరుకు చెందిన శ్రీ చక్రవర్తి (హాట్ ఆపరేషన్), జనరల్ సర్జరీ చేయించుకున్న శ్రీ సాయినాథ్ తదితర రోగులతో ఈవో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రోగులు, వారి సహాయకులు టీటీడీ అందిస్తున్న నాణ్యమైన వైద్యం, ఇతర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.