లడ్డూ ప్రసాదాల తయారీ నాణ్యత
తిరుమల : శ్రీవారి పోటులో లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికుల విధుల గురించి టీటీడీ ఈవో జె.శ్యామల రావు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. శుక్రవారం రాత్రి గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఈవో, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి పోటు కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.
ఇందులో భాగంగా, బూందీ తయారీ, చక్కర కలపడం, జీడి పప్పును బూందీలో కలపడం, లడ్డును తయారు చేసి, లడ్డు కౌంటర్లోకి పంపడం, లడ్డు ప్రసాదం పంపిణీ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు.
టీటీడీ ఈవో జె. శ్యామలా రావు మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా పేరు ఉందని, దానిని మరింత నాణ్యవంతంగా, రుచికరంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. స్వామి వారి దైవ కార్యక్రమంగా ప్రతి ఒక్కరు భావించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో పోటు శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.