వెల్లడించిన టీటీడీ ఈవో జె. శ్యామల రావు
తిరుమల – తిరుమలలో ఫిబ్రవరి 4న రథ సప్తమి జరుగుతుందని తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ఈ సందర్బంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఏఈవో, జేఈవోలను ఆదేశించారు. పాత భవనాలను పునర్ నిర్మించడం జరుగుతుందన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు చెందిన సిఫారసు లేఖలు తీసుకోమన్నారు ఈవో.
అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. రథసప్తమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుందని తెలిపారు.
భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్యాలరీలలో ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం అధికారులతో కలిసి నాలుగు మాడ వీధుల్లో ఏర్పాట్ల పరిశీలించారు.
రథసప్తమి సందర్భంగా పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు (Services and Darshans) చేసినట్లు ఈవో పేర్కొన్నారు. అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ ఉండవని, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని వివరించారు.
బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని కోరారు. ఈ సమీక్షలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ తదితరులు పాల్గొన్నారు.