మరింత మెరుగ్గా నిర్వహించాలని ఆదేశం
తిరుమల – శ్రీవాణి ట్రస్ట్ లో ప్రస్తుతం ఉన్న నిబంధనలను పునః సమీక్షించుకుని మరింత మెరుగ్గా, సులభతరంగా, పారదర్శకంగా ఉండేలా తయారు చేయాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సనాతన ధర్మాన్ని మరింత విస్తృతంగా జన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ఆలయాల నిర్మాణాలు పునాదుల్లాంటివని స్పష్టం చేశారు.
ఆలయాల నిర్మాణాలతో దైవచింతన, ఆధ్యాత్మికత, సేవా భావం సమభావంతో మానవ సంబంధాలు పెరుగుతాయన్నారు. ఇప్పటికే సమరసత సేవా పౌండేషన్, దేవాదాయ శాఖ సౌజన్యంతో నిర్మితమవుతున్న ఆలయాల ప్రస్తుత స్థితి, జీర్ణాద్ధరణ పనులు ఏ దశలో ఉన్నాయో నివేదిక తయారు చేయాలన్నారు. పూర్తి అయిన ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు, నిర్వహణ అందించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.
ఆలయాల నిర్మాణం జరుగుతున్నపుడు, పూర్తయిన తరువాత ఆలయ నిర్వహణను టిటిడి తరచూ తనిఖీలు చేపట్టాలని సూచించారు. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల నిర్వహణకు పక్కాగా ప్రణాళికలు, వెనుకబడిన ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల నిర్వహణకోసం ప్రత్యేకంగా యంత్రాంగాన్ని రూపొందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మం, చీఫ్ ఇంజనీర్ టి.వి. సత్యనారాయణ, ఎఫ్ఏసిఏవో ఓ. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.