శ్రీవారి సేవ దక్కడం అదృష్టం
నూతన ఈవో జె. శ్యామల రావు
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కోట్లాది మంది భక్తులు భావించే శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో సేవ చేసే మహత్ భాగ్యం తనకు దక్కడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు నూతన ఈవో జె. శ్యామల రావు. ఇవాళ ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తిరుమల లోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తాను పనినే దైవంగా విశ్వసిస్తానని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుండి హిందువులు పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయానికి నిత్యం దర్శనార్థం వస్తుంటారని అన్నారు. వారికి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందన్నారు. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.
టీటీడీలో మంచి పరిపాలన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయం తిరుమల, ఇక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు జవాబు దారి తనంతో పాటు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తిరుమలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, స్వామి వారి దర్శనార్ధం వచ్చే ప్రతి భక్తుడు సంతోషంగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. స్వామివారి కైంకర్యాలు సక్రమంగా నిర్వహించడంతో పాటు భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈవో.
తిరుమల శ్రీవారి ఆలయం అభివృద్ధి పై సీఎంకు ఒక విజన్ ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమి, సివి అండ్ ఎస్ఓ కిషోర్, సి ఇ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.