వెంగమాంబ కార్మికులకు వేతనాలు రిలీజ్
స్పష్టం చేసిన టీటీడీ జేఈవో వీర బ్రహ్మం
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఇదే సమయంలో వారి ఆకలిని తీరుస్తోంది తిరుమల లోని తరిగొండ వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్.
వందలాది మంది కార్మికులు నిత్య అన్నదానంలో పాలు పంచుకుంటున్నారు. వీరితో పాటు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తమ జన్మను ధన్యం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్ లో పని చేస్తున్న కార్మికులకు గత రెండు నెలలుగా వేతనాలు అందక పోవడంతో ఇబ్బందులు పడ్డారు.
ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. వారితో టీటీడీ జేఈవో వీర బ్రహ్మం మాట్లాడారు. వెంటనే కార్మికుల సమస్యను పరిష్కరించారు. సిబ్బంది జీతాలు బ్యాంకు ద్వారా వారి కాంట్రాక్టర్ కు పంపించడం జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటికే మొదటి బ్యాచ్ కార్మికుల జీతాలు పంపడం జరిగిందని, గురువారం రెండవ బ్యాచ్ కార్మికుల జీతాలు అకౌంట్లో వేయడం జరుగుతుందని తెలిపారు.
కాగా అన్న ప్రసాదం కార్మికులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తమ విధుల విరామ సమయంలోనే అధికారులను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అనంతరం వారు యధావిధిగా తమ విధులకు హాజరయ్యారు.