ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన జేఈవో
తిరుపతి – అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి ఆలయ రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం, వార్షిక బ్రహ్మోత్సవాలు ఆహ్వాన పత్రికలను టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనా భవనంలోని జేఈవో ఛాంబర్ లో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
తంబళ్ళపల్లి మండలం కోసువారి పల్లి గ్రామం నందు శ్రీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి ఆలయం రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం జనవరి 29 నుండి ఫిబ్రవరి 3 వరకు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4 నుండి 12 వరకు జరుగుతాయని టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం తెలిపారు.
రాజగోపుర ప్రతిష్ట మహోత్సవానికి జనవరి 29న సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. జనవరి 30 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగనుండగా, ఫిబ్రవరి 3వ తేదీన ఉదయం చతుస్తానార్చన, మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, రాజగోపుర ప్రతిష్ట మహోత్సవం ఉ. 9.30 నుండి 10.15 వరకు కుంభప్రోక్షణ, శాత్తుమొర, నివేదన, మంగళహారతి, ఆచార్య బహుమానం కార్యక్రమాలు జరుగనున్నాయి.
స్థల పురాణం:
క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో వేంగిచోల మహారాజు ఆలయాన్ని నిర్మించడం జరిగినది. శ్రీ కృష్ణదేవరాయలు కుటుంబీకులైన శ్రీ అచ్చుత దేవరాయలు, శ్రీ కంభం తిమ్మారాజు కూడా స్వామివారికి అనేక సువర్ణాభిరాములు చేసి అనేక మాన్యములు దానమిచ్చినట్టుగా శాసనం ద్వారా తెలుపబడుచున్నది.
చోళ మహారాజు ఒకరోజు రాత్రి ఈ శ్రీ ప్రదేశంన బస చేయగా, ఆ రోజున స్వామివారే స్వప్నంలో సాక్షాత్కరించి ఈ ప్రదేశం నందు ఆలయ నిర్మించమని కోరగా నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
తాళ్లపాక అన్నమాచార్యులు వారు కూడా స్వామి వారిని దర్శించి స్వామివారి మీద అనేక సంకీర్తనలు కూడా రచించి ఉన్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీ ప్రసన్న వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 4 నుండి ఫిబ్రవరి 12 వరకు జరుగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 6-9 గం.ల మధ్య అంకురార్పణ జరుగనుంది.
ఫిబ్రవరి 4న ఉ.8 – 8.50 గం.ల మధ్య ధ్వజారోహణం, రాత్రి 8-10 గం.ల వరకు పల్లకి ఉత్సవం, ఫిబ్రవరి 5న ఉదయం శేషవాహనం, రాత్రి హంస వాహనం, ఫిబ్రవరి 6న ఉ. ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహ వాహనం, ఫిబ్రవరి 7న ఉ.కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, ఫిబ్రవరి 8న ఉ. సూర్య ప్రభ, రా. చంద్రప్రభ వాహనం, ఫిబ్రవరి 9న ఉ. సర్వభూపాల వాహనం, రా. 8 గం.లకు కళ్యాణోత్సవం, రా.10.30 లకు గరుడ వాహనం, ఫిబ్రవరి 10న ఉ. 7 గం.లకు రథారోహణ, ఉ.9.05 గం.లకు రథగమనం, రాత్రి గజవాహనం, ఫిబ్రవరి 11న ఉ. పల్లకి ఉత్సవం, రా. అశ్వవాహనం, ఫిబ్రవరి 12న ఉ.7. గం.లకు వసంతోత్సవం, ఉ.11.30 గం.లకు చక్రస్నానం, రాత్రి 7.గం.లకు ధ్వజారోహణం, ఫిబ్రవరి 13న సా. 5 గం.లకు పుష్పయాగం జరుగనుంది.
వార్షిక బ్రహ్మోత్సవాలలో ఉదయం 8 – 9 గం.ల వరుకు, రాత్రి 8 – 10 గం.ల వరకు వాహన సేవల్లో స్వామి వారు ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతిరోజూ ఉ. 10.30 – మ. 12. గం.ల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ప్రతిరోజూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథలు, సంగీతం, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో పి.వరలక్ష్మీ, ఏఈవో గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు.