DEVOTIONAL

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు – జేఈవో

Share it with your family & friends

నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు

తిరుప‌తి – శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

ఆయన అధికారులతో కలిసి అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడ వీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, ఘంటసాల సర్కిల్ , హైస్కూల్ పరిసరాలు, పసుపు మండపం, పూడిరోడ్డు తదితర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన పంచమి తీర్థం నాడు విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, రేణిగుంట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు. అదే విధంగా భక్తులు సేద తీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, గోశాల (పూడి రోడ్డు) వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు.

పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలని స్ప‌ష్టం చేశారు.

టిటిడి సివిఎస్వో శ్రీధర్ మాట్లాడుతూ అమ్మ వారి బ్రహ్మోత్సవాలలో భద్రతా పరంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

పంచమి తీర్థం రోజున భక్తులు సేద తీరేందుకు ఏర్పాటు చేసే షెడ్లలో, క్యూలైన్లు, పుష్కరిణి వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా తిరుమల నుంచి పసుపు ఊరేగింపు మార్గాలను ముందే పరిశీలించి ఆ మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సమావేశంలో సిఈ సత్యనారాయణ, ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి, ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు గోవింద రాజన్, గుణ భూషణ్ రెడ్డి , సెల్వం, శివ ప్రసాద్, విజివో సదా లక్ష్మీ, అదనపు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్ కుమార్, ఈఈలు నరసింహ మూర్తి, మల్లికార్జున ప్రసాద్ , రవిశంకర్ రెడ్డి, తిరుచానూరు పంచాయతీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.