వైభవోపేతం కార్తీక మహా దీపోత్సవం
కన్నుల పండువగా కార్యక్రమం
తిరుపతి – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో కనీ విని ఎరుగని రీతిలో కార్తీక మహా దీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.
ముందుగా ఎస్వీ వేద విశ్వ విద్యాలయం వేద పండితులు యతి వందనం, వేద స్వస్తి అనంతరం దీప ప్రాశస్త్యాన్ని తెలియజేశారు.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మ వారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమ శాస్త్ర బద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, శ్రీనివాస అర్చన నిర్వహించారు. ఎస్వీ వేద విశ్వవి ద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు.
ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. చివరగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్ర హారతి, కుంభహారతి సమర్పించారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది.