టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
కీలక అంశాలపై చర్చించిన బోర్డు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి సమావేశం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం తిరుమల లోని అన్నమయ్య భవనంలో జరిగింది. ఈ సమావేశానికి పాలక మండలి సభ్యులతో పాటు ఎక్స్ అఫిసియో సభ్యులు ఈవో జె. శ్యామల రావు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు వీర బ్రహ్మం, గౌతమి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా తిరుమలకు సంబంధించి కీలకమైన అంశాలపై చర్చించారు. ప్రధానంగా తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఇటీవల చోటు చేసుకున్న వివాదాల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ బోర్డు సభ్యులపై గురుతరమైన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. కోట్లాది మంది భక్తుల ఇలవేల్పుగా తిరుమల శ్రీవారిని కొలుస్తున్నారని, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.
బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. అంతకు ముందు పాలకమండలి అధ్యక్షుడి హోదాలో తన నేతృత్వంలో సభ్యులందరితో కలిసి ముందుగా శ్రీవారిని ప్రార్థన చేసి సమావేశం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.