DEVOTIONAL

చైర్మ‌న్ గా ఛాన్స్ సీఎంకు థ్యాంక్స్ – బీఆర్ నాయుడు

Share it with your family & friends

విశిష్ట సేవ‌ల‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వం

చిత్తూరు జిల్లా – త‌న‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి చైర్మ‌న్ గా నియ‌మించినందుకు టీవీ5 చైర్మ‌న్ బొల్లినేని రాజ గోపాల్ నాయుడు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. బీఆర్ నాయుడు వ‌య‌సు 72 ఏళ్లు. ఆయ‌న స్వ‌స్థ‌లం చిత్తూరు జిల్లా.

మీడియా సంస్థ‌కు య‌జ‌మానిగా, వ్యాపార‌వేత్త‌గా గుర్తింపు పొందారు. బీఆర్ నాయుడు స్వ‌స్థ‌లం
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామం. వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బి ఆర్ నాయుడు చిన్నతనం నుంచి పట్టుదల స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరి వాడు.

సాంకేతిక విద్య నేర్చుకుని బీహెచ్ఈఎల్ హైదరాబాదులో ఉద్యోగంలో చేరారు. యువ ఉద్యోగిగా బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చాలా చురుకుగా పనిచేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బిహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. ఉద్యోగుల తరఫున సాహిత్య సాంస్కృతిక అంశాలపై ఒక ప్రత్యేక పక్ష పత్రిక కూడా బిఆర్ నాయుడు నడిపారు.

టీడీపీలో చురుకైన పాత్ర పోషించారు. బీఆర్ నాయుడు తర్వాత తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వ్యాపార రంగంలో ప్రవేశించారు. ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బిఆర్ నాయుడు అంచలంచలుగా ఎదుగుతూ తర్వాత టీవీ5, హిందూ ధర్మం, నూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు. 2007లో టీవీ5 ఛానెల్ ను ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాల ప్రగతిని, ప్రజాస్వామ్య విలువలను కాంక్షించే నాయుడు. కేవలం ఓ ఛానల్ యజమానిగా మాత్రమే ప్రజా సమస్యలను వినిపించేందుకు పరిమితం కాలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ కు ఓ ప్రపంచ స్దాయి నంగరం రాజధాని ఉండాలనే విధానాన్ని బలంగా సమర్ధించారు. 2018లో హిందూ ధ‌ర్మం పేరుతో ఆధ్యాత్మిక ఛాన‌ల్ ప్రారంభించారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను హిందూ ధర్మం ద్వారా యావత్ తెలుగు ప్రజలకు చేరువచేసే ప్రయత్నం బీఆర్ నాయుడు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ హిందూ భక్తుడికీ అత్యంత ప్రీతపాత్రమైన శివపార్వ‌తుల‌ కళ్యాణం నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు బీఆర్ నాయుడు.