ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయం
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి
తిరుమల – టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. అన్న ప్రసాదం కోసం అదనంగా 258 సిబ్బంది నియామకం చేపడతామని చెప్పారు.
అదే విధంగా విద్యా పరంగా విశిష్ట సేవలు అందిస్తున్న కంచి కామకోటి పీఠం పాఠశాలకు రూ.2 కోట్లు కేటాయించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తుల క్యూ కాంప్లెక్స్ వద్ద రూ. 3.6 కోట్ల ఖర్చుతో టాయిలెట్స్ నిర్మించాలని తీర్మానం చేశామన్నారు టీటీడీ చైర్మన్.
ఇదే సమయంలో సాంకేతిక పరంగా చోటు చేసుకున్న కీలక మార్పులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించు కోవాలని నిర్ణయించామన్నారు. దీని కారణంగా ఇప్పటి వరకు భక్తులు ఎదుర్కొంటున్న శ్రీవారి దర్శనం కేవలం 2 లేదా 3 గంటల్లోపే పూర్తవుతుందని చెప్పారు.
ఇదే సమయంలో గత వైసీపీ సర్కార్ హయాంలో టీటీడీ పాలకమండలి ఆధ్వర్యంలో కేటాయించిన స్థలాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా విశాఖ శారదా పీఠానికి నోటీసులు ఇచ్చామన్నారు ఈవో జె. శ్యామల రావు. ఇంకా వారి నుంచి స్పందన రాలేదన్నారు.