తిరుమల శ్రీవారి సారె ట్రయల్ రన్
పెద్ద ఎత్తున తిలకించిన భక్తులు
తిరుపతి – తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి రోజున భక్తులు విశేషంగా విచ్చేస్తారు ఈ వేడుకకు. ఇదిలా ఉండగా పంచమి తీర్థానికి తిరుమల నుండి వచ్చే శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ ఘనంగా నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి .
తిరుపతిలోని చెన్నారెడ్డి కాలనీలో గల శ్రీ వినాయక స్వామి వారి ఆలయం నుండి శ్రీవారి సారె ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది. అక్కడి నుండి ఏనుగుపై సారెను ఊరేగింపుగా తీసుకొచ్చారు.
ముందుగా శ్రీ కోదండ రామాలయం, చిన్న బజారు వీధి, పాత హుజుర్ ఆఫీస్, శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, బండ్ల వీధి, ఆర్‌టిసి బస్టాండు, పద్మావతి పురం, మార్కెట్ యార్డు, శిల్పారామం మీదుగా తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు చేరుకున్నారు.
అక్కడి నుండి శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయం వద్దకు చేరుకుని మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దగల మండపానికి సారెను వేంచేపు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.