ఆన్లైన్ టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
తిరుమల – శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 19న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మే 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
22న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
23న అంగప్రదక్షిణం టోకెన్లు రిలీజ్ చేయనుంది. ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. శ్రీవారి సేవ(తిరుమల మరియు తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ (సీనియర్ సేవక్స్) సేవల జూలై నెల కోటాను మే 29న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.