ఆరోపణలు అబద్దం రుణ మాఫీ నిజం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్ – రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 2 లక్షల లోపు కలిగిన రైతులందరికీ వారి ఖాతాల్లో నిధులు జమ చేయడం జరిగిందన్నారు. పూర్తిగా రుణాలను మాఫీ చేశామని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు తుమ్మల నాగేశ్వర్ రావు.
ఇందుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు ముందుగానే విడుదల చేశామన్నారు. ఇంకా అవసరమైతే ఎవరికైనా రుణాలు మాఫీ కాక పోతే, లేదా అందక పోతే తిరిగి తమ వివరాలు సంబంధిత మండలాలలో వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ప్రస్తావించినా లేదా తెలియ పరిస్తే వెంటనే అప్ లోడ్ చేయడం జరుగుతుందన్నారు.
తాము ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా రుణాలు మాఫీ చేశామన్నారు తుమ్మల నాగేశ్వర్ రావు. రుణ మాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉండగానే విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇప్పటికి కేవలం రెండు లక్షల వరకు కుటుంబ నిర్దారణ జరిగిన ఖాతాదారులందరికి పధకాన్ని వర్తింప చేశామని చెప్పారు.
2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తామని ప్రకటించారు. రుణ మాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరామన్నారు తుమ్మల నాగేశ్వర రావు.
ఇప్పటి వరకు మొత్తం రూ. 18,000 కోట్లు రుణాలను మాఫీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.