ఉద్దవ్ ఠాక్రే షాకింగ్ కామెంట్స్
ముంబై – శివసేన పార్టీ చీఫ్ , మాజీ మరాఠా ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసింది. దీంతో కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ , శివసేన షిండే పార్టీతో కలిసి సంయుక్తంగా బరిలో నిలవనుంది.
ఇదిలా ఉండగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీతో పాటు భాగస్వామిగా ఉన్న ఉద్దవ్ ఠాక్రే ఇవాళ ఎన్నికలకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో వైపు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ రాహుల్ గాంధీని , ఆయన నాయకత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు.
ఈ దేశం పట్ల పూర్తి అవగాహనతో పాటు గౌరవం, భక్తి ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. ఈ తరుణంలో ఇండియా కూటమి కలిసే ముందుకు వెళుతుందా లేక ఉద్దవ్ ఠాక్రే పార్టీ ఒంటరిగా వెళుతుందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.
రాహుల్ గాంధీ ఎవరి పట్ల చులకన చేసి మాట్లాడ లేదన్నారు. అయితే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు హిందూ ధర్మానికి సమానం కాదన్నారు ఉద్దవ్ ఠాక్రే. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం శివుడి చిత్రాన్ని చూపించకుండా హిందూ ధర్మాన్ని అవమానించిందని సంచలన ఆరోపణలు చేశారు.