భయం మా బ్లడ్ లో లేదు
నిప్పులు చెరిగిన ఉద్దవ్ ఠాక్రే
న్యూఢిల్లీ – భయం తమ కుటుంబంలో, బ్లడ్ లో లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు శివసేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే. ఇండియా కూటమి ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన నిరాహారదీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు.
మోదీ తాను మాత్రమే ఉండాలని అనుకుంటున్నాడని, ఇతర ప్రతిపక్ష పార్టీలు, నేతలు ఉండ కూడదని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. అప్రజాస్వామిక పద్దతులతో బీజేపీ ఇవాళ దేశాన్ని పాలిస్తోందని ఆరోపించారు. కానీ ఈ దేశంలో న్యాయం ఇంకా బతికే ఉందని సీజేఐ ద్వారా నిరూపితమైందన్నారు.
ఎవరు అవినీతి పరులో, ఎవరు అక్రమాలకు తెర తీశారో దేశంలోని 143 కోట్ల మంది భారతీయులకు తెలుసన్నారు ఉద్దవ్ ఠాక్రే. తాము ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. తామంతా ఎదురొడ్డి పోరాడుతామని హెచ్చరించారు. ఈడీ, సీబీఐ, ఐటీని ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను భయ పెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు మాజీ సీఎం.
బీజేపీలో చేరే అవినీతి పరులతో దేశాన్ని ఎలా అభివృద్ది చేస్తారో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి చెప్పాలని డిమాండ్ చేశారు.