31వ తేదీ వరకు 5 రోజుల పాటు ఉత్సవాలు
కర్నూలు జిల్లా – కోట్లాది భక్తుల కొంగు బంగారంగా పేరు పొందిన శ్రీశైల మహా పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిటలాడుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా శివ నామ స్మరణతో మారుమ్రోగుతోంది నల్లమల. మార్చి 27 గురువారం నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈవో. ఈ ఉత్సవాలు మార్చి 31వ తేదీ వరకు 5 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. స్వామి, అమ్మ వార్లకు వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
ఉత్సవాలలో భాగంగా ప్రతీరోజు స్వామి, అమ్మ వార్లకు వాహన సేవ, అమ్మ వారికి విశేషాలంకరణలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈవో. 27వ తేదీ గురువారం రోజు శ్రీ భ్రమరాంబికా అమ్మ వారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనం ఇస్తారని తెలిపారు. రాత్రి స్వామి, అమ్మ వార్లకు భృంగి వాహన సేవ , 28న శుక్రవారం భ్రమరాంబికా అమ్మ వారికి మహా దుర్గ అలంకారం, రాత్రి స్వామి, అమ్మ వార్లకు కైలాస వాహన సేవ, 29వ తేదీన శనివారం భ్రమరాంబికా అమ్మ వారికి మహా సరస్వతి అలంకారం, సాయంత్రం ప్రభోత్సవం, నంది వాహన సేవ, వీరాచార విన్యాసాలు, అగ్ని గుండ ప్రవేశం ఉంటుందన్నారు.
30వ తేదీ ఆదివారం రోజున శ్రీ భ్రమరాంబికా అమ్మ వారికి శ్రీ రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారం ఉంటుందన్నారు. ఉదయం ఉగాది పంచాంగ శ్రవణం, సాయంత్రం రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 31న సోమవారం అమ్మ వారికి శ్రీ భ్రమరాంబికా దేవి నిజాలంకరణ, పూర్ణాహుతి ,అశ్వవాహన సేవ ఉంటుందన్నారు.