మోదీకి వివరిస్తా సాయం అందేలా చూస్తా
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
విజయవాడ – కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అనంతరం సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు. వర్షాల కారణంగా ఏపీ పూర్తిగా దెబ్బ తిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని, కేంద్ర సహాయక బృందాలు తమ వంతు ప్రయత్నం చేశాయని చెప్పారు కేంద్ర మంత్రి.
గత ప్రభుత్వం ఫసల్ బీమా యోజనా పథకాన్ని పట్టించు కోలేదని ఆరోపించారు శివ రాజ్ సింగ్ చౌహాన్. కూటమి ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుందని తెలిపారు. ఏపీ వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని, త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తానని చెప్పారు .
కేంద్ర కమిటీ నివేదిక చూశాక ఆర్థిక సాయం అందుతుందని స్పష్టం చేశారు శివ రాజ్ సింగ్ చౌహాన్. కష్ట సమయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందన్నారు. దీనిపై త్వరలోనే కేంద్ర బృందాలు జరిగిన నష్టంపై అంచనా వేస్తాయని తెలిపారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్ , అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.