NEWSTELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిక‌కు సిద్దం

Share it with your family & friends

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ , జూప‌ల్లి కృష్ణా రావు తో క‌లిసి మీడియాతో మాట్లాడారు.

25 మంది కేసీఆర్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే వారంతా కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకునేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయ‌న చేసిన ఈ ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే సీఎం రేవంత్ రెడ్డి తాము గేట్లు తెరిచామ‌ని ఇక బీఆర్ఎస్ చాప్ట‌ర్ క్లోజ్ కాక త‌ప్ప‌ద‌ని ప్ర‌క‌టించారు.

ఇదే స‌మ‌యంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సంఖ్య‌ల‌తో స‌హా చెప్ప‌డం ఒకింత గులాబీ పార్టీలో గుబులు రేపేలా చేసింది. ఎవ‌రు ఆ 25 మంది ఎమ్మెల్యేల‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇప్ప‌టికే దానం నాగేంద‌ర్ తో పాటు రంజిత్ రెడ్డి జంప్ అయ్యారు.

ఏ ఎమ్మెల్యే ఎవ‌రెవ‌రితో ట‌చ్ లో ఉన్నార‌నే దానిపై బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ఆరా తీస్తున్న‌ట్లు స‌మాచారం. మొత్తంగా నిన్న‌టి దాకా కాంగ్రెస్ ను ఖ‌తం చేయాల‌ని అనుకున్న గులాబీ దొర‌కు ఇప్పుడు కునుకు ప‌ట్ట‌కుండా చేయ‌డంలో రేవంత్ రెడ్డి స‌క్సెస్ అయ్యాడ‌నేది వాస్త‌వం.