సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతి తర్వాత రాష్ట్రంలోని అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు శాసన మండలిలో. కుల గణన సర్వే పూర్తయిందని, దాని ఆధారంగా లబ్దిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు.
ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తి చేస్తామన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లను చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగిందని అన్నారు . గత 10 ఏళ్లుగా తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని వాపోయారు.
ప్రతి నెలా వారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే సరి పోతోందని, పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. అర్హులైన వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డులు ఇచ్చి తీరుతామని చెప్పారు. మరో వైపు చాలా మంది రేషన్ బియ్యం బాగా లేవని తినడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.
త్వరలోనే ఆయా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.