కేసీఆర్ నిర్వాకం కాళేశ్వరానికి శాపం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గరం గరం
హైదరాబాద్ – కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రీ డిజైనింగ్ చేయించింది మాజీ సీఎం కేసీఆరేనని, ఈ పాపం ఆయనదేనంటూ నిప్పులు చెరిగారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న కేసీఆర్, హరీశ్, కేటీఆర్ లను ఏకి పారేశారు. చేసింది చాలక విమర్శలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
కేసీఆర్ స్వయంగా డిజైన్ చేసిందంటూ గొప్పలు చెప్పుకున్నది మీరేనంటూ ఎద్దేవా చేశారు. కట్టినప్పుడు, కూలినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరో తెలియకుండా మాట్లాడితే ఎలా అంటూ ఫైర్ అయ్యారు. కూలి పోయిన 47 రోజుల తర్వాత అధికారంలోకి వచ్చామన్నారు.
నీటి పారుదల రంగాన్ని నాశనం చేశారంటూ ఆరోపించారు. వాస్తవాలను వక్రీకరించడం, అబద్దాలను నిజాలుగా నమ్మించడం కల్వకుంట్ల ఫ్యామిలీకి అలవాటేనంటూ మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కమీషన్లకు కక్కుర్తి పడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకనైనా గోబెల్ ప్రచారానికి స్వస్తి పలకాలని హితవు పలికారు. కాళేశ్వరం కు మేడిగడ్డ గుండె కాయ అన్నది మీరే కాదా అని ప్రశ్నించారు. 94 వేల కోట్లు ఖర్చు చేసి 93 వేల ఎకరాలకు నీరందిస్తే ఎలా అని మండిపడ్డారు.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలను ఉపయోగంలోకి తీసుకు రావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 44 గ్రామాలతో పాటు భద్రాచలం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. వడ్డీ అసలు కలిపి రూ. 15,000 వేల కోట్లు కడుతున్నామని చెప్పారు. పూర్తి స్థాయిలో పూర్తి కావాలంటే ఇంకా లక్షా 47 వేల కోట్లు కావాల్సి ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.