ప్రకటించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – ఆరు నూరైనా సరే రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఆపే ప్రసక్తి లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు కావాలని బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్ని అప్పులు చేసైనా సరే లబ్దిదారులకు నిధులు పంపిణీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆన్ గోయింగ్ పథకాలను ఎందుకు నిలుపుదల చేస్తామంటూ ప్రశ్నించారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో క్రెడిబులిటీ ఉన్న నాయకునిగా చెబుతున్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంతకంటే మంచి పాలన ఇంకెప్పుడూ రాబోదన్నారు. కానీ బీఆర్ఎస్ కావాలని తమ పట్ల నిరాధారమైన ఆరోపణలు చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రజలు వారి చేష్టలను చూసి నవ్వుకుంటున్నారని, అయినా బుద్ది రావడం లేదన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. ప్రతి దానిని రాజకీయం చేయాలని అనుకోవడం మంచి పద్దతి కాదని హితవు పలికారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పూర్తి పారదర్శకతతో కూడిన పాలనను అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరుతుందన్నారు.