స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ – తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని రీతిలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని గ్రాండ్ గా అమలు చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్బంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా విధిగా సన్న బియ్యం తీసుకున్న లబ్దిదారుల ఇళ్లల్లో ఒక రోజు భోజనం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సన్నబియ్యం విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గతంలో సంవత్సరానికి 24 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేశామని చెప్పారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. సంవత్సరంకు 13600కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. గతంలో 10,665 కోట్లు మాత్రమే ఖర్చు చేసేదన్నారు. గతంలో 2.81 లక్షల రేషన్ కార్డులు ఉంటే ఇప్పుడు 3.10 లక్షల మందికి రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారని, 29 లక్షల రేషన్ కార్డులు పెరిగాయన్నారు . సన్నబియ్యం కేంద్రం ఇస్తుందన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. కేంద్రం ఇచ్చే బియ్యానికి 20 శాతం ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.కేంద్రం ఇచ్చేది మొత్తం దొడ్డు రకమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 49 వేల కార్డులే ఎక్కువ ఇచ్చారని ఆరోపించారు.