కుంగి పోనున్న మేడిగడ్డ..అన్నారం
సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీలో శనివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేశారు . ఈ సందర్బంగా మేడిగడ్డ బ్యారేజ్ తరహా లోనే అన్నారం బ్యారేజ్ కూడా కుంగి పోనుందని హెచ్చరించారు.
ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు ఉపయోగ పడదని నేషనల్ డ్యాం సేఫ్టీ కమిటీ తేల్చి చెప్పిందని, అన్నారం బ్యారేజ్ నుంచి కూడా అదే విధంగా లీకేజీలు మొదలయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పోవడానికి ప్లానింగ్, డిజైన్ల లోపంతో పాటు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల, ఆ తర్వాత సరైన పద్ధతిలో మెయింటెనెన్స లోపాల వల్ల పూర్తిగా దెబ్బతిందన్నారు.
మేడిగడ్డ తరహాలోనే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను కూడా నిర్మించారని గుర్తు చేశారు. మేడిగడ్డ వైఫల్యాలకు కారణాలను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధ్యయనం చేసి 2023 నవంబర్ 21న వెల్లడించిన విషయాలను ఈ రోజు సభ ముందుంచారు.
వైఫల్యానికి ప్రధాన కారణం మేడిగడ్డ బ్యారేజ్ లో రాఫ్ట్ కుంగి పోవడంతో పాటు పియర్స్ కదిలి, కుంగి పోయాయని తెలిపారు. తద్వారా మొత్తం బ్యారేజ్ కి పగుళ్లు వచ్చి పెద్ద పెద్ద బొరియలు, రంధ్రాలు ఏర్పడ్డాయన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
పియర్స్ కింద ఉన్న ఇసుక కదలడం, ఫౌండేషన్ మెటీరియల్ కు తగినంత బేరింగ్ సామర్థ్యం లేక పోవడం వల్ల బ్యారేజ్ బరువు తట్టుకోలేని విధంగా కుంగి పోయిందని ఎన్ ఎస్ డి ఏ ) వెల్లడించిందన్నారు.
పైల్స్ నిర్మాణంలో కఠినమైన నాణ్యత ప్రమాణాలు పాటించాలి. కానీ ఇక్కడ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాఫ్ట్, కటాఫ్ ట్రెంచ్ ల మధ్య ఫ్లింత్ కనెక్షన్లో నిర్మాణ లోపం ఉందని తేల్చిందన్నారు.. తద్వారా నీటి ప్రవాహానికి అడ్డం ఏర్పడి మొత్తం బ్యారేజ్ దెబ్బతినిందన్నారు.