సమగ్ర కుల గణన అవసరం – శ్రీనివాస్ గౌడ్
ఎవరి వాటా ఏమిటో తేలాల్సిన అవసరం
హైదరాబాద్ – మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యుద్ద ప్రాతిపదికన సమగ్ర కుల గణన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణనకు మద్దతుగా హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు. సమగ్ర కుల గణన చేయడం వల్ల ఎవరి వాటా ఏమిటనేది తేలుతుందన్నారు. ఇప్పటికే ఎందరో రిజర్వేషన్లకు నోచుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో సమగ్ర కుల గణన జరిగిందని, ఇప్పుడు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్.
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని, అన్ని వర్గాలకు చెందిన వారికి ప్రాతినిధ్యం దక్కాలంటే ముందుగా సమగ్ర కుల గణన పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు.
ఈ కీలక సమావేశంలో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, మాజీ ఎంపీ హనుమంత్ రావు, బాలరాజు గౌడ్, ఐలీ వెంకన్న, కుల్కచర్ల శ్రీనివాస్, తదితరులు హాజరయ్యారు. తమ విలువైన సూచనలు అందజేశారు.