మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ముంబై – కేంద్ర ప్రభుత్వం ఓబీసీల కుల గణన జరిపించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. ముంబైలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమాధి చైత్య భూమిని సందర్శించారు. ఘనంగా నివాళులు అర్పించారు. చట్ట సభల్లో కుల దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.
అంబేద్కర్ గనుక రాజ్యాంగం రాయక పోయి ఉంటే బహుజనులకు రాజ్యాధికారం దక్కేది కాదన్నారు. చైత్య భూమిని సందర్శించిన అనంతరం మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం కావాలని ఓబీసీల విషయంలో కక్ష సాధింపు ధోరణిని వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మా కోటా మా వాటా అన్న నినాదంతో ముందుకు వెళుతున్నామని, ఓబీసీలకు సంబంధించి కుల గణన చేపడితే తమ బండారం బయట పడుతుందని అగ్ర వర్ణాల సామాజిక వర్గాలు అడ్డు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి.
అంతకు ముందు ముంబైలోని ఎస్సి, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు వి. శ్రీనివాస్ గౌడ్ కు పంచశీల , నీలి కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. ముంబై వలస జీవులు ఎదురుకొంటున్న పలు సమస్యలను మాజీ మంత్రికి వివరించారు.