కమలంతో గులాబీ విలీనం అబద్దం
ఢిల్లీకి వస్తే కలిపేస్తామంటే ఎలా..?
ఢిల్లీ – మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారతీయ జనతా పార్టీతో తమ పార్టీ విలీనం జరుగుతున్నట్లు వస్తున్న ప్రచారంపై స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ పనుల మీద ఢిల్లీకి వస్తే కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో బీఆర్ఎస్ కు సంస్థాగత పరమైన కార్యకర్తల బలం ఉందని స్పష్టం చేశారు శ్రీనివాస్ గౌడ్. ఢిల్లీకి వస్తే విలీనం చేసినట్లు అనుకోవడం దారుణమన్నారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఆయన కోరారు.
తమ నాయకుడు కేసీఆర్ బలమైన వ్యక్తిగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడని, గత 10 ఏళ్ల పాలనలో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణను తీర్చి దిద్దాడని ఇంతకంటే ఇంకేం కావాలన్నారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదన్నారు.
కొన్నేళ్ల తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారని, అప్పుడు బీఆర్ఎస్ తిరిగి పవర్ లోకి రావడం తప్పదన్నారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. ఇలాంటి దుష్ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని సూచించారు.