తరగని స్పూర్తి రామోజీ
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ – మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ ఘనమైన నివాళి అర్పించారు ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావుకు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ సందర్బంగా.
నిన్న అనారోగ్యంతో మృతి చెందిన రామోజీరావు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఆయన జీవితం ఎందరికో స్పూర్తి దాయకమని పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా తాను రామోజీరావుతో కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు.
ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం రామోజీరావుది అని కొనియాడారు. ఆయన మరణం బాధాకరమని, తెలుగు పత్రికా రంగానికే కాదు సినిమా, వ్యాపార, వాణిజ్య రంగాలకు తీరని లోటు అని పేర్కొన్నారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్.
సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రామోజీరావు అసమాన్య విజయాలు సాధించారని, కోట్లాది మందిని ప్రభావితం చేశారని కొనియాడారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, విలువలు జోడించిన వ్యక్తి అని పేర్కొన్నారు.
ఈ తీరని దుఃఖ సమయంలో రామోజీ రావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఆయన ఆత్మకు శాశ్వత శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.