కేసీఆర్ హయాంలోనే పాలమూరు..రంగారెడ్డి పనులు
మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్
హైదరాబాద్ – మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు 90 శాతం తమ పార్టీ అధినేత కేసీఆర్ హయాంలోనే జరిగాయని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాలువుల పనులు పెండింగ్ లో ఉన్నాయని, తాము టెండర్లు పిలిచామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని రద్దు చేసిందని ఆరోపించారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో కొలువు తీరిన 10 నెలల సుదీర్ఘ కాలం తర్వాత ఇప్పుడు సర్కార్ నిద్ర నుంచి మేల్కొందన్నారు. ఏదుల, నార్లాపూర్, కరివెన తదితర పంప్ హాజ్‌లు తమ సర్కార్ హయాంలోనే పూర్తయినట్లు చెప్పారు శ్రీనివాస్ గౌడ్ .
పాలమూరు అంటేనే వలసలకు పెట్టింది పేరు అని, దానిని కేసీఆర్ పూర్తిగా మార్చి వేశారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో లక్షలాది ఎకరాలు ఇవాళ పచ్చదనంతో కళ కళ లాడుతున్నాయని, దీనికి తమ అధినేత చొరవ వల్లనే సాధ్యమైందని అన్నారు.
తాము ఇప్పటికే పిలిచిన టెండర్లను కొనసాగించి ఉంటే ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయి ఉండేదన్నారు. ఈ వానా కాలం పంటలకు నీళ్లు దక్కేవన్నారు. గతంలో పాలమూరు కరువును చూపించి అప్పటి ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవాళ తెలంగాణను ధాన్యాగారంగా మార్చేసిన ఘనత కేసీఆర్ దేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు ఇకనైనా భేషజాలకు పోకుండా త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కోరారు.