కాంగ్రెస్ మోసం రైతులకు శాపం – శ్రీనివాస్ గౌడ్
బీఆర్ఎస్ రైతు ధర్నాలో మాజీ మంత్రి కామెంట్స్
మహబూబ్ నగర్ జిల్లా – మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా రైతు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
ఈ సందర్బంగా షాద్ నగర్ మండల రెవిన్యూ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం వాటి గురించి ఆలోచించడమే మానిసిందని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ప్రస్తుతం రైతులకు కంటి మీద కునుకే లేకుండా చేస్తోందని ధ్వజమెత్తారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ .
ఎన్నికలకు ముందు రైతులకు ఎకరానికి రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ దాని ఊసే లేదన్నారు. రైతులను నిట్ట నిలువునా మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి. ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని, సీఎంను నిద్ర పోనివ్వమని హెచ్చరించారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్.
ఏడాది లోపు 2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని చెప్పారని, 10 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు ఎన్ని భర్తీ చేశారో చెప్పాలన్నారు. జీవో29, జీవో 55 లపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇది మంచిది కాదన్నారు. రైతులకు రైతు బంధు, రైతు భరోసా ఇవ్వాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.