కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమాగం
నిప్పులు చెరిగిన వి. శ్రీనివాస్ గౌడ్
వనపర్తి జిల్లా – తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ ధర్నాలో మాజీ మంత్రులు సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి, తన్నీరు హరీశ్ రావు, బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వి. శ్రీనివాస్ గౌడ్.
రైతు బంధు, రైతు భరోసా ఊసే లేకుండా పోయిందన్నారు. అదిగో ఇదిగో అంటూ మభ్య పెడుతున్నారే తప్పా ఆదుకోవడం లేదని ఆరోపించారు. మరో వైపు శ్రమకు ఓర్చి పండించిన పత్తి పంటకు సరైన మద్దతు ధర లభించడం లేదంటూ వాపోయారు మాజీ మంత్రి.
ప్రస్తుతం రైతులకు న్యాయం చేయాలని, వారు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని, కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.