రేవంత్ సర్కార్ కు వీఎస్ వార్నింగ్
హైదరాబాద్ – మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ను చాట్ భండార్ లాగా మార్చేశారంటూ మండిపడ్డారు. నీరా కేఫ్ ను ఎత్తేస్తున్నట్లు సమాచారం అందడంతో ఆయన ఆదివారం కేఫ్ ను సందర్శించారు.
నీరా కేఫ్ రూపు రేఖలు మార్చడం పట్ల మండిపడ్డారు. అంతరించి పోతున్న నీరాను పునరుద్దరించడం జరిగిందని, గౌడ కులస్తుల, వృత్తి పని వారికి ఆత్మ గౌరవం కల్పించేలా చేశామన్నారు. నీరా కేఫ్ ను తరలిస్తే ఉద్యమిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
కుల వృత్తులను కాపాడాలనే ఉద్దేశంతో ఆనాడు సీఎం కేసీఆర్ నీరా కేఫ్ కు రూపకల్పన చేశారన్నారు. కల్లు , నీరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, గౌడ కులానికి సంబంధించి అమృతం లాంటి నీరాను పరిచయం చేసిన ఘనత తనదేనని అన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రూ. 20 కోట్లతో దేశంలో ఎక్కడా లేని రీతిలో నీరా పాలసీని తీసుకు వచ్చామని చెప్పారు వి. శ్రీనివాస్ గౌడ్.
ఇందులో కేవలం గౌడ కులస్తులకే ప్రయారిటీ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నీరా కేంద్రాన్ని ప్రైవేట్ పరం చేసి శంకర్ రెడ్డి అనే వ్యక్తికి రేవంత్ రెడ్డి కట్టబెట్టినట్లు తనకు తెలిసిందన్నారు. ఇది ప్రభుత్వానికి చెందినదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేక పోతే తీవ్ర ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు సీఎంకు.