ప్రకటించిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
ఢిల్లీ – ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఈగల్ టీమ్ (ఎంపవరడ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్ పర్ట్స్) సభ్యుడిగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వంశీ చందర్ రెడ్డిని నియమించింది. ఆయనతో పాటు అజయ్ మాకేన్, దిగ్విజయ్ సింగ్, అభిషేక్ సింఘ్వీ, ప్రవీణ్ చక్రవర్తి, పవన్ ఖేరా, గురుదీప్ సింగ్ సప్పల్, నితిన్ రావత్‌లను ఎంపిక చేసిందని పార్టీ వెల్లడించింది.
చల్లా వంశీ చందర్ రెడ్డి యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. గాంధీ కుటుంబంలోని రాహుల్ గాంధీకి అనుంగు అనుచరుడిగా, నమ్మిన బంటుగా ఉన్నారు. ఆయన స్వస్థలం కల్వకుర్తి నియోజకవర్గం. గతంలో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, కల్వకుర్తి ఎమ్మెల్యేగా పని చేశారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తను నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గానికి చెందినప్పటికీ అక్కడ ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో ఏఐసీసీ వంశీ చందర్ రెడ్డిని పాలమూరు లోక్ సభ స్థానానికి తమ పార్టీ తరపున అభ్యర్థిగా ఖరారు చేసింది.
కానీ ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీకి చెందిన గద్వాల జేజమ్మగా పేరొందిన డీకే అరుణ భరత సింహా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. విచిత్రం ఏమిటంటే ఇదే లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ వంశీ ఓడి పోవడం విస్తు పోయేలా చేసింది.