కన్ను మూసిన దరిపల్లి రామయ్య
జీవితమంతా ప్రకృతిని ప్రేమించి వనజీవిగా పేరు పొందిన ఖమ్మం జిల్లాకు చెందిన దరిపల్లి రామయ్య కన్నుమూశారు. తన వయసు 88 ఏళ్లు. లెక్కకు మించి మొక్కలు నాటారు. ఖమ్మంతో పాటు చుట్టు పక్కల చెట్లు పెంచుకుంటూ పోయాడు. మొక్కలు పెంచండి ప్రకృతిని కాపాడాలంటూ ప్రచారం చేశాడు. ఎక్కడికి వెళ్లినా అడవులను కాపాడాలని కోరాడు. సైకిల్ పై ప్రయాణం చేశాడు. మొక్కలు నాటాలని, చెట్లను కాపాడు కోవాలంటూ ప్ల కార్డులతో ముందుకు సాగాడు. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న మన వనజీవి రామయ్య కోట్లాది మందికి ఆదర్శ ప్రాయంగా నిలిచాడు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారత దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మశ్రీ దక్కింది. జూలై 1, 1937లో ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో పుట్టాడు.
చెట్ల సంరక్షకుడిగా పేరొందాడు. మొక్కలను పెంచడంతో వనజీవి రామయ్యగా మారి పోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటికి పైగా మొక్కలు నాటిన ఘనత ఆయనకు దక్కుతుంది. తల్లిదండ్రులు లాలయ్య, పుల్లమ్మ. ముత్తగూడెంలో చదువుకున్నాడు. ఆ సమయంలోనే టీచర్ మల్లేశం ప్రబోధించిన ‘మొక్కల పెంపకం- లాభాలు’ అనే పాఠం అతనిలో స్ఫూర్తి నింపింది. తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా భాగంలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచాడు రామయ్య. అది మొదలు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటుకుంటూ పోయాడు.
వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వన పెంపకానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు వనజీవి రామయ్య. వయసు పెరిగినా మొక్కలపై ఉన్న ప్రేమ చంపుకోలేదు. అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించి, మొక్కలు పెంచి, పది మందికి పంపిణీ చేశారు. రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టల వెంట, జాతరలు, ఖాళీ జాగాల్లో, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ గింజలు నాటుకుంటూ పోయాడు రామయ్య. ఈ మొక్కలను పది మందికీ పంచి హరితహారం ఏర్పడేలా చేశారు. ఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనం ఇస్తున్నాయి.
వృక్షో రక్షతి రక్షితః అని రాసి ఉన్న ప్ల కార్డులను తగిలించుకుంటూ ప్రచారం చేస్తూ వచ్చాడు రామయ్య. ఏ శుభకార్యానికి వెళ్లినా విత్తనాలు, మొక్కలు తీసుకువెళ్లి బహుమతిగా ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో రామయ్య జీవితం వనజీవిగా ఆయన కృషిని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు. వనజీవి లేక పోవడం తెలంగాణకు తీరని విషాదం.