మహా గణపతిం మనసా స్మరామీ – అనిత
గణనాథా ఏపిని ఆదుకోవా
విజయవాడ – వినాయక చవితి సందర్బంగా ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శనివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ లో ఘనంగా గణనాథుడి పూజా కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు నిమ్మల రామా నాయుడు, పొంగూరు నారాయణతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడుకు పూజారులు ఆశీర్వచనం అందజేశారు.
వినాయక చవితిని పురస్కరించుకుని కీలక వ్యాఖ్యలు చేశారు వంగలపూడి అనిత. వరద విపత్తు ముప్పేట చుట్టుముట్టి..అల్లాడుతున్న ఎన్టీఆర్ జిల్లా ప్రజలు సహా రాష్ట్ర ప్రజలందరినీ కాపాడాలని ఆ విఘ్నపతిని వేడుకున్నానని తెలిపారు రాష్ట్ర హోం శాఖ మంత్రి.
‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న’ అన్న సూక్తిని పాటిస్తూ ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా వరద బాధితుల సాయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు వంగలపూడి అనిత. బాధితుల కడుపు నింపుదాం..ప్రజా సేవలో తరిద్దాం..జనతా జనార్దుడిని మనసారా కొలుద్దామని పిలుపునిచ్చారు. .